: ప్రియాంకా గాంధీకి కోర్టు నోటీసులు... సిమ్లా భూవివాదంలో జారీ చేసిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు


గాంధీ కుటుంబానికి కోర్టు నోటీసులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రాకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో గతంలో ప్రియాంకా ఓ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య దరఖాస్తు చేశారు. ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సిందేనన్న రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు సమాచార కమిషన్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రియాంకా గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు భూమికి సంబంధించిన వివరాలు ఎందుకు వెల్లడి చేయరాదో తెలపాలంటూ ఆ నోటీసుల్లో కోర్టు ప్రియాంకా గాంధీని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో కోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News