: టీటీడీ చైర్మన్ పదవికి గురిపెట్టిన మురళీమోహన్!... రాయపాటి, గంగరాజు యత్నాలు ఫలించేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కాల పరిమితి బుధవారంతోనే ముగిసిపోయింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన పాలకమండలిని మరో ఏడాది పాటు కొనసాగించే దిశగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పాలకమండలిని గడువు పూర్తైనా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయలేదని తెలుస్తోంది. పాలకమండలి కొనసాగితే... మరో ఏడాది పాటు ఆశావహులు ఆగాల్సిందే. అలా కాకుండా పాలకమండలిని రద్దు చేస్తే మాత్రం టీటీడీ చైర్మన్ పదవి కోసం పలువురు ప్రముఖులు రంగంలోకి దిగనున్నారు. పాలకమండలి కొనసాగింపు, రద్దు విషయంపై ఎటూ తేలని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. టీటీడీ చైర్మన్ పదవి తనకే ఇవ్వాలంటూ ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ పదవి కోసం పలుమార్లు యత్నించి విఫలమైన గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఇప్పటికే తనదైన శైలిలో యత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక మిత్రపక్షం బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఈ పదవిని చేజిక్కించుకునేందుకు యత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుత పాలకమండలి రద్దైతే... ఈ ముగ్గురిలో ఎవరు టీటీడీ చైర్మన్ పదవిని చేజిక్కించుకుంటారన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.