: ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ సీట్లు!... ఒక్క కర్నూలులోనే 4 పెరుగుతాయి: చంద్రబాబు
ఏపీలో కొత్తగా మరో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయట. ప్రస్తుతం రాష్ట్రంలో 175 సీట్లు ఉండగా, వీటి సంఖ్య త్వరలోనే 225కు పెరుగుతుందన్న ప్రచారం సాగుతోంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాత్రం సీట్ల సంఖ్య పెరిగి తీరుతుందని చెప్పుకొచ్చారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి (కర్నూలు జిల్లా శ్రీశైలం), కిడారి సర్వేశ్వరరావు (విశాఖ జిల్లా అరకు) టీడీపీలో చేరిపోయారు. విజయవాడలో జరిగిన ఈ చేరికల సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఈ అంశాన్ని మరోమారు ప్రస్తావించారు. రాష్ట్రంలో కొత్తగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయని ఆయన చెప్పారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే నాలుగు సీట్లు పెరుగుతాయని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలతో పాటు కొత్తగా పార్టీలోకి చేరుతున్న వారికి సీట్ల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని చంద్రబాబు చెప్పారు.