: నాపై దుష్ప్రచారాన్ని ఎవరూ ఖండించరేం? ఇలా అయితే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటా!: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఈరోజు హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో తెలంగాణ శాసనసభా పక్ష నేత జానారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నాననే వార్తలని ఆయా పత్రికల్లో పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని ఆయన మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానంటూ ఆయన సీరియస్ గా అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీలోకి ఆయన త్వరలో వెళ్లనున్నారని సొంత పార్టీ వాళ్లే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా తాను వాటిని ఖండిస్తానని, అదే తనపై వస్తున్న ఆరోపణలను, దుష్ప్రచారాన్ని ఎవరూ ఖండించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనపై ఆరోపణలను ఖండించలేదని, ఖండించి ఉంటే బాగుండేదని అన్నారు. సీఎల్పీ పదవి నుంచి తాను తప్పుకుంటానన్న జానా వ్యాఖ్యలతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం విస్తుపోయారు. వెంటనే తేరుకుని తమ నాయకుడిగా ‘మీరే ఉండాలంటూ’ వారు జానారెడ్డికి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News