: బ్రాండిక్స్ లో మళ్లీ ఉద్రిక్తత!... కంపెనీ గేటు ముందు వందలాది మంది కార్మికులు
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వేతనాల పెంపుతో పాటు పీఎఫ్ బకాయిల విడుదలను కోరుతూ ఈ నెల 15న సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ ఎదుట వందలాది మంది కార్మికులు బైఠాయించారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ యువరాజ్ ల చొరవతో అప్పటికి ఆందోళన విరమించిన కార్మికులు రెండు రోజులు గడిచాయో, లేదో మరోమారు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నాటి ఆందోళన కూడా త్వరితగతిన ముగియగా... తాజాగా నేటి ఉదయం వందలాది మంది కార్మికులు కంపెనీ గేటు ముందు బైఠాయించారు. ఈ నెల 15 నాటి ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీని కంపెనీ యాజమాన్యం నిలబెట్టుకోని కారణంగానే నేడు కార్మికులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఉన్నపళంగా వందలాది మంది కార్మికులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.