: ధర్మాన, గీతారెడ్డిలకూ ఊరట!... జగన్ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, అధికారులకు ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. తాజాగా నిన్న జరిగిన విచారణ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రులుగా కొనసాగిన ధర్మాన ప్రసాదరావు, జె.గీతారెడ్డిలకు ఊరట లభించింది. వీరిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మాన, గీతారెడ్డిలతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి శామ్యూల్స్ కు కూడా కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.