: బయోమ్యాక్స్ లో ఆరని మంటలు!... యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అధికారుల నిర్ధారణ
విశాఖ జిల్లా దువ్వాడ సెజ్ లోని బయోమ్యాక్స్ కంపెనీలో మొన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి... అగ్ని కీలలు ఇంకా అదుపులోకి రాలేదు. 24 గంటలు దాటినా అక్కడ ఇంకా అగ్ని కీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. స్థానిక ఫైర్ సిబ్బందితో పాటు భారత నావికా దళం రంగంలోకి దిగినా... అగ్ని జ్వాలలు ఆరడం లేదు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే కాస్తంత ఫలితమిస్తున్నాయి. నేటి మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి రావచ్చని సమాచారం. ఇదిలా ఉంటే... దాదాపు రూ.200 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిన ఈ ప్రమాదానికి... బయోమ్యాక్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. ఆయిల్ ట్యాంకర్లు ఉన్న ప్రదేశంలో సరైన భద్రతా చర్యలను చేపట్టడంలో యాజమాన్యం విఫలమైందని విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ మేరకు తేల్చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్... పలు కోణాల్లో దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.