: గొట్టిపాటి చేరిక సభకు కరణం డుమ్మా!... అధినేతకు ముంచే చెప్పి ముఖం చాటేసిన సీనియర్!


ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన సొంతింటి నుంచి భారీ అనుచరగణంతో వచ్చి టీడీపీలో చేరిపోయారు. వైసీపీ టికెట్ పై గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరితో విసుగు చెంది సైకిలెక్కేశారు. ఈ క్రమంలో ఆయనకు జిల్లాలో ఆగర్భ శత్రువుగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం... చేరికను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే విపక్ష నేత సవాళ్లకు గట్టిగా బదులివ్వాలంటే చేరికలకు జైకొట్టక తప్పదన్న అధినేత నారా చంద్రబాబునాయుడి సూచనతో కరణం నిరసనకు చెక్ పడింది. అయితే నిన్న విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గొట్టిపాటి చేరిక సభకు మాత్రం కరణం హాజరుకాలేదు. ఈ విషయం నిన్న అక్కడి టీడీపీ నేతలను కాస్తంత కలవరానికి గురిచేసినా... ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొన్ననే తన కొడుకు, అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కరణం వెంకటేశ్ సహా తన ముఖ్య మద్దతుదారులతో విజయవాడ వచ్చిన కరణం బలరాం... చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గొట్టిపాటి చేరిక సభకు తాను హాజరు కాలేనని చంద్రబాబుకు చెప్పడంతో పాటు ఆయన అనుమతితోనే నిన్నటి ఆ సభకు కరణం దూరంగా ఉన్నారట.

  • Loading...

More Telugu News