: స్పీడ్ బ్రేకర్ ఉండదు... కానీ త్రీడీ బ్రేకర్ ఉంటుంది
రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వాహనదారులను ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంటాయి. వేగంగా వస్తూ ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ ఎక్కేస్తే వంట్లోని ఎముకలన్నీ ఒక్కసారిగా కదిలిపోవడం అనుభవమే. ఈ నేపథ్యంలో వాహనదారులకు వినసొంపైన మాటను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్లపై ఎత్తుగా ఉండే స్పీడ్ బ్రేకర్లు దగ్గరకు వస్తే గానీ కనిపించేలా ఉండవు. కానీ వర్చువల్ త్రీడీ స్పీడ్ బ్రేకర్లు అయితే దూరం నుంచే కనిపించడంతో వాహనదారులు వేగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. వేగం తగ్గకపోయినా కుదుపులు ఉండవు. ఎందుకుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ హెచ్చరిక కేవలం 3డీ పెయింటింగ్ రూపంలోనే ఉంటుంది. వాహనదారుల ర్యాష్ డ్రైవింగ్ ను కట్టడి చేసే దిశగా 3డీ పెయింటింగ్స్ తో వర్చువల్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో 3 లక్షల మంది వరకు గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ ట్వీట్ ను కొందరు స్వాగతించగా, మరికొందరు భిన్నంగా స్పందించారు. 14 ఏళ్ల క్రితం అమెరికా, కెనడాలో త్రీడీ స్పీడ్ బ్రేకర్లు విధానం ప్రారంభమైతే ఎట్టకేలకు ఇంతకాలానికి దేశంలో ఇవి రాబోతున్నాయంటూ ఒకరు స్పందించారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ కాదు, ఉన్నది పెయింట్ మాత్రమే అని ఒకసారి డ్రైవర్ కు తెలిసిన తర్వాత వాహనాలకు బ్రేకులు పడతాయా? అని మరొకరు ట్విట్టర్ లో సందేహం వ్యక్తం చేశారు.