: బాబు చేసిన స్కామ్ ల కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి: వైఎస్ జగన్
గత రెండేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 31 స్కామ్ లు చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇసుక, విద్యుత్... ఈ విధంగా ఏ అంశాన్ని చూసినా మోసాలు, స్కామ్ లే ఉన్నాయని, వాటికి సంబంధించిన ఫొటో స్టాట్ కాపీలు తన వద్ద ఉన్నాయని అన్నారు. కేవలం ‘అమరావతి’ స్కామే లక్షల కోట్లలో ఉందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అక్కడ వస్తోందని, ఇక్కడ వస్తోందంటూ మొదట్లో చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. తనకు సంబంధించిన వారు అమరావతి ప్రాంతంలో భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసిన తర్వాత, అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. ఆయనకు సంబంధించిన బినామీల భూములన్నీ అగ్రికల్చర్ జోన్-3 లో ఉండగా, మిగిలిన వారి భూములు అగ్రికల్చర్ జోన్-1లో ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు చేసిన స్కామ్ ల గురించి కేవలం రెండు, మూడు ఉదాహరణలే చెప్పానని, ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. ఇంకా లోతుగా వెళితే, సీబీఐ ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు చేసిన మరిన్ని మోసాలు బయటపడతాయన్నారు. ఇన్ని మోసాలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రశ్నించేవారే కరవయ్యారని జగన్ అన్నారు.