: గొట్టిపాటి జంపింగ్ కు కారణం... జగన్ చేసిన ‘మూడు’ గాయాలేనట!


ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గొట్టిపాటి రవికుమార్ కు ఓ ప్రత్యేక స్థానముంది. యువకుడైన రవికుమార్ ఇప్పటికే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత ఓడిపోనేలేదు. ఈ లెక్కన ఆ జిల్లాలో గొట్టిపాటి సీనియర్ ఎమ్మెల్యే కిందే లెక్క. 2009లో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంను మట్టి కరిపించిన గొట్టిపాటి... 2014 ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేశ్ ను ఓడించారు. అంతేకాకుండా కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో గొట్టిపాటికి టీడీపీలోకి స్వాగతం ఎలా లభించింది? అసలు ఆయన టీడీపీలో చేరేందుకు దారి తీసిన కారణాలేమిటి? అన్న అంశాలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటిదాకా వైసీపీ టికెట్లపై విజయం సాధించి టీడీపీలోకి జంప్ అయిన వారిలో మెజారిటీ మంది గతంలో టీడీపీ నేతలే. అయితే గొట్టిపాటికి ఇప్పటిదాకా అసలు టీడీపీతోనే సంబంధాలు లేవు. మరి ఆయన టీడీపీలో చేరేందుకు కారణాలేంటి? అన్న విషయాలపై ఓ లుక్కేస్తే... 2004లో మార్టూరు నుంచి ఎన్నికైన గొట్టిపాటి... 2009లో అద్దంకికి మారారు. అక్కడి నుంచి 2009లో కరణం బలరాం, 2014లో కరణం కుమారుడిని చిత్తు చేసిన గొట్టిపాటి సత్తా చాటారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య ఉన్న వైషమ్యాలు మరింత పెరిగాయి. ఈ సమయంలోనే ఇటీవల సాగర్ నీటి విషయమై తన నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వచ్చిన మంత్రికి వినతి పత్రం అందించేందుకు గొట్టిపాటి తన అనుచర గణంతో తరలివెళ్లారు. ఆ సందర్భంగా గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య పెద్ద ఘర్షణే చోటుచేసుకుంది. గొట్టిపాటి కారుపై కరణం వర్గం దాడికి దిగింది. ఈ దాడిపై కాస్తంత వేగంగా స్పందించిన టీడీపీ నేతలు... గొట్టిపాటికి మద్దతుగా నిలిచి, కరణం వర్గం తీరును ప్రశ్నించారు. అదే సమయంలో సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి గొట్టిపాటికి కనీసం పలకరింపు కూడా అందలేదు. దీంతో గొట్టిపాటి మనసుకు గాయమైంది. ఇక మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటిని జగన్ సీనియర్ ఎమ్మెల్యేగా పరిగణించలేకపోయారు. ఇటీవల ఓ సందర్భంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఇంటిలో జరిగిన ఓ వివాహానికి వచ్చిన జగన్... సదరు విషయాన్ని గొట్టిపాటికి మాటమాత్రంగానైనా చెప్పలేదు. దీంతో రెండో మారు గొట్టిపాటికి గాయమైంది. ఇక గొట్టిపాటికి అయిన కీలక గాయం విషయానికొస్తే... ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కడంలో గొట్టిపాటిదే కీలక భూమిక. అయితే తన బాబాయి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన జగన్... జడ్పీలో మెజారిటీకి కారణమైన గొట్టిపాటిని కనీసం భుజం కూడా తట్టలేదు. ఈ విషయం గొట్టిపాటికి తీరని గాయం చేసింది. ఈ మూడు గాయాలతోనే గొట్టిపాటి... తన ప్రత్యర్థి వర్గమున్న టీడీపీలోకి మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏతావాతా జగన్ నిర్లక్ష్యమే... గొట్టిపాటిని పార్టీ మారేలా చేసిందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News