: 'అవినీతి చక్రవర్తి'!... చంద్రబాబుపై బుక్కును విడుదల చేసిన వైఎస్ జగన్
తెలుగు నాట రాజకీయాల్లో ‘కరప్షన్’ పేరిట మరో బుక్కు రిలీజైంది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... విపక్ష నేత హోదాలో ‘రాజా ఆఫ్ కరప్షన్’ పేరిట రూపొందించిన ప్రత్యేక బుక్కును ఢిల్లీలో విడుదల చేశారు. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రాగా... వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేత హోదాలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున డబ్బు, మంత్రి పదవులు ఎరవేస్తున్న చంద్రబాబు వారిని టీడీపీలోకి లాగేసుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’కు చెక్ పెట్టేందుకు జగన్ ఏకంగా ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ఉద్యమం చేపట్టారు. ప్రస్తుతం ఈ ఉద్యమం నిన్న ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జగన్ ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. చంద్రబాబు అవినీతి అక్రమాలను వివరిస్తూ రూపొందించిన సదరు బుక్కుకు ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ (అవినీతి చక్రవర్తి) అని జగన్ పేరు పెట్టారు. ఉద్యమంలో భాగంగా తాము కలిసే జాతీయ నాయకులకు సదరు బుక్కును అందజేసి... చంద్రబాబు దుర్నీతిని ఎండగడతామని జగన్ పేర్కొన్నారు.