: పవన్ కల్యాణ్ ‘జనసేన’కు ఏపీలో రాజకీయ పార్టీ హోదా!
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. ఇప్పటికే తెలంగాణలో దానికి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ లోనూ ఆ పార్టీకి ‘పొలిటికల్ పార్టీ’ హోదా దక్కింది. ఈ మేరకు నిన్న ఏపీ ఎన్నికల సంఘం... జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ కు పార్టీ గుర్తింపునకు సంబందించిన పత్రాలు చేరాయి. పవన్ కల్యాణ్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించాలని ఆ పత్రాల్లో ఎన్నికల సంఘం సూచించింది. అయితే, జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికీ ... ఇంకా ఆ పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించాలని 2014లో పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సుదీర్ఘ సమయాన్నే తీసుకున్న సంఘం ఎట్టకేలకు దానిని ముగించింది. జనసేన గుర్తింపునకు సంబంధించి కృష్ణ అనే వ్యక్తి వెలిబుచ్చిన అభ్యంతరాలను కొట్టేసిన సంఘం... రాజకీయ పార్టీగా జనసేనకు గుర్తింపునిచ్చింది.