: మాఫియా డాన్ దావూద్ కు గ్యాంగ్రీన్... రెండు కాళ్లు తీసేయాల్సి రావచ్చంటున్న వైద్యులు!
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్ (ఇన్ఫెక్షన్ తో కూడిన పుండు)తో బాధపడుతున్నట్లు మీడియా సమాచారం. సీఎన్ఎన్- న్యూస్ 18 కథనం ప్రకారం, దావూద్ ప్రస్తుతం కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడని, కోలుకోవడం కష్టమని దావూద్ కు వైద్య చికిత్స అందించిన వైద్యులు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. గ్యాంగ్రీన్ కారణంగా దావూద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆ కథనం ద్వారా తెలుస్తోంది. హై బీపీ, బ్లడ్ షుగర్ కారణంగా దావూద్ కాళ్లలో రక్తసరఫరా సవ్యంగా జరగటం లేదని, భవిష్యత్ లో ఆయన కాళ్లు తొలగించడం తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చని దావూద్ వైద్యులు పేర్కొన్నట్లు రాసింది. దావూద్ తన క్లిఫ్టన్ నైబర్ హుడ్ రెసిడెన్స్ లో చికిత్స పొందుతున్నాడు. కరాచీలోని లియాఖత్ నేషనల్ ఆసుపత్రి, కంబైన్డ్ మిలటిరీ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందినట్లుగా ఆ న్యూస్ ఛానెల్ లో ప్రసారం చేసింది. దావూద్ కాళ్లలోని అధిక కణజాలం ఇప్పటికే ‘డెడ్ ’ అయిందని సమాచారం. కాగా, కరాచీ నుంచి ఆయన్ని ఎక్కడికీ కదిలించకూడదని, ఆర్మీ వైద్యులే ఆయన చికిత్స నిర్వహించాలని గతంలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే.