: ఇంతమంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతమే: 'డిక్టేటర్’ శతదినోత్సవ వేడుకలో బాలకృష్ణ
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సందడి చేశారు. ఆయన నటించిన 'డిక్టేటర్’ చిత్రం శతదినోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసేందుకు అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన శతదినోత్సవ వేడుకల కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ, ఇసుకవేస్తే రాలనంతమంది అభిమానులు ఇక్కడికి వచ్చారని, వారందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడమంటే పూర్వజన్మ సుకృతం, రుణానుబంధమే... అంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం శతదినోత్సవ మెమొంటోలను అందజేశారు.