: ఆర్ఎస్ఎస్ లోకి మహిళలను కూడా అనుమతించాలి!: తృప్తి దేశాయ్
మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు శని సింగనాపూర్, నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర గర్భగుళ్ల లోకి మహిళలకు ప్రవేశం కోసం పోరాడి, విజయం సాధించిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ కన్ను ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై పడింది. ఈ సంస్థలో మహిళలు చేరేందుకు అనుమతించాలని ఆమె ఈరోజు కోరారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మహిళల ఓట్లు కూడా కీలకపాత్ర పోషించాయన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ లో మహిళలను చేర్చుకోవాలని కోరారు. లింగ సమానత అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు త్వరలో ఒక లేఖను రాయనున్నట్లు చెప్పారు. కాగా, తృప్తి దేశాయ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షురాలు కాంతా నాలావాదే స్పందించారు. హాస్యాస్పదమైన డిమాండ్లు చేయడం కన్నా మహిళా సమస్యలపై తృప్తి దేశాయ్ దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.