: కూరగాయలు, పాలు మోసే వారికే పీసీసీ పదవులు... అందుకే కారెక్కుతున్నా: ఎమ్మెల్సీ ఫారుఖ్
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ‘ఆపరేషన్ ఆకర్ష్’ కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాజాగా టీ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు కారెక్కుతున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, సిద్దిపేటకు చెందిన ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ గులాబీ దళంలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఫారుఖ్... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. డబ్బున్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యం దక్కుతోందని ఆయన ఆరోపించారు. కూరగాయలు, పాలు మోసే వారికే పీసీసీ పదవులిచ్చారని ధ్వజమెత్తారు. పెద్ద నాయకులంతా ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాను టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నానని ఫారుఖ్ హుస్సేన్ చెప్పారు.