: పాలేరు టికెట్ నాకే ఎందుకు ఇచ్చారంటే..: తుమ్మల
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పాలేరు ఉప ఎన్నికల్లో తనకే ఎందుకు టికెట్ లభించిందన్న విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నియోజకవర్గ ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉండటం కారణంగానే తనను పోటీ చేయాలని కేసీఆర్ కోరినట్టు తెలిపారు. ఖమ్మం, పాలేరు ప్రాంతాల్లో 4 వేలకు పైగా చెరువులు ఉండగా, వాటిల్లో 2 వేల చెరువులను శుభ్రం చేశామని, ఇవన్నీ తదుపరి వర్షాకాల సీజనులో నీటితో కళకళలాడనున్నాయని అన్నారు. పేదల సంక్షేమ పథకాల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానానికి తీసుకువెళతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి మాత్రమే ఓట్లు వేస్తారని, సెంటిమెంటు పనిచేయదని తుమ్మల అభిప్రాయపడ్డారు. విపక్షాలన్నీ ఏకమైనా తన గెలుపు ఖాయమని అన్నారు. తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం అతని అభీష్టంపైనే ఆధారపడి వుందని వ్యాఖ్యానించారు.