: స్పైస్ జెట్ కు తప్పిన ముప్పు... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సేఫ్
‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఢిల్లీ వెళ్లేందుకు నేటి ఉదయం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పైస్ జెట్ విమానం ఎక్కారు. వైసీపీ నేతలతో పాటు మరికొందరు ప్రయాణికులతో 8.45 గంటలకు ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సదరు విమానం తిరిగి శంషాబాదు ఎయిర్ పోర్టులోనే ల్యాండైంది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెనువెంటనే విమానాన్ని వెనక్కు తిప్పారు. దీంతో సదరు విమానానికి పెద్ద ముప్పే తప్పింది. మరికాసేపట్లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పైస్ జెట్ సిబ్బంది తెలపడంతో వైసీపీ నేతలంతా ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయారు.