: ప్రచారం ప్రారంభించిన రాజకీయ ఉద్దండ పండితుడు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 93 ఏళ్ల వయసులోనూ రాజకీయ వ్యూహాలతో యువకుడిని తలపిస్తూ ముందుకు సాగే ఆయన శనివారం సైదాపేట నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 12 వరకు ఆయన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముచ్చటగా 13వ సారి కరుణానిధి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. తిరువారూర్ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఆయన ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రత్యేక వాహనంలో 30కి పైగా బహిరంగ సభల్లో కరుణానిధి ప్రసంగించనున్నారు. ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కరుణానిధి 1957 నుంచి ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఏ ఒక్కసారి ఓటమి ఎరుగని విజయవంతమైన నేత.