: ఐడియా చిన్నది...ఫలితం మాత్రం పెద్దదే!


ఎంత దూరం నడవాలన్నా తొలి అడుగుతోనే ప్రారంభం కావాలి...అలాంటి అడుగే పూణేలోని ఓ స్కూలు నుంచి ప్రారంభమైంది. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని లాతూర్ నీటి కొరతతో అల్లాడిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పూణేలోని వేదాంత్ గోయల్, యూసుఫ్ సోనీ అనే పారిశ్రామిక వేత్తల ఆలోచన ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతోంది. సాధారణంగా చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు బ్యాగ్ లో వాటర్ బాటిల్ పెట్టి పంపిస్తారు. అయితే చదువు, ఆటల్లో పడిన పిల్లలు ఆ నీటిని పూర్తిగా తాగరు. అలాగని ఇంటికి కూడా తీసుకెళ్లరు. ఇంట్లో వాళ్లు తిట్టకుండా రోడ్డుపై ఒలకబోసేస్తారు. ఈ నీటిని అలా పారబోయవద్దని, స్కూలులో ఏర్పాటు చేసిన వాటర్ డ్రమ్ లో పోయాలని వేదాంత్, సోనీ స్కూలు పిల్లలను ప్రోత్సహించారు. అలా సేకరించిన నీటిని స్కూలులో మొక్కలు, బాత్రూంలు కడిగేందుకు వినియోగించడం మొదలుపెట్టారు. దీంతో పూణే వ్యాప్తంగా ఉన్న పలు స్కూళ్లలో నీటి కొరత చాలా వరకు తీరిపోయింది. ఒక్క స్కూలుతో మొదలైన ఈ చైతన్యం వివిధ స్కూళ్లకు పాకిందని, ఇది మహోద్యమంగా మారితే నీటిని వేస్టు చేయడం అన్న పదం వినబడదని వేదాంత్, సోనీ అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News