: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు... ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధం... తిప్పికొట్టడానికి పాలక పక్షం కసరత్తులు!
బడ్జెట్ సెషన్స్ రెండో దశ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించడానికి మొదటి రోజు చర్చకు నిర్దేశించిన ఇతర అన్ని అంశాలను వాయిదా వేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో మొదటి రోజే ఉత్తరాఖండ్ అంశాన్ని చర్చిస్తామంటూ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితిపై పాలక పక్షాన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో సోమవారం పార్లమెంట్‌లో యుద్ధ వాతావరణం కనపడనుందని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఎన్డీఏపై విమర్శలు గుప్పించడానికి ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అటు పాలక పక్షం కూడా తమకు ఎదురయ్యే విమర్శల దాడిని ఎదుర్కునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సామాన్య ప్రజానీకం సైతం సోమవారం జరిగే సమావేశంలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయమని భావిస్తున్నారు. కరవును ఎదుర్కొనేందుకు ఎన్డీఏ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ఈ విషయంపై పార్లమెంట్ సమావేశాల్లో మొదటిరోజే చర్చ జరగాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. 267వ నిబంధన ప్రకారం ఈ విషయంపై చర్చ జరగాల్సిందేనంటున్నారు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం రగడ తప్పదని స్పష్టమవుతోంది. ఎన్డీఏ సర్కారు ప్రతిపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.