: నిరసనల భయంతో... గాంధీభవన్ ఖాళీగానే ఉన్నా గోల్కొండ హోటల్ లో టీ పీసీసీ భేటీ!
టీ పీసీీసీతో పాటు ఏపీ కాంగ్రెస్ కమిటీ సమావేశాల కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద సువిశాలమైన గాంధీ భవన్ ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఒక్కటిగానే ఉన్న ఈ కార్యాలయం... రాష్ట్ర విభజన తర్వాత రెండుగా విడిపోయింది. ప్రధాన కార్యాలయంలో టీ పీసీసీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, వెనుక వైపు ఉన్న భాగంలో ఏపీసీసీ కోసం... ఇందిరా భవన్ పేరిట ప్రత్యేక బోర్డు వెలిసింది. అవాంతరాలొస్తే ఏపీసీసీకి రావాలి గానీ, టీ పీసీసీకి వచ్చే సమస్యే లేదు. మరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన టీ పీసీసీ కార్యవర్గ సమావేశం వేదిక నగర పరిధిలోని మెహిదీపట్నం పరిసరాల్లో ఉన్న గోల్కొండ హోటల్ కు ఎలా మారింది? ఇటివలే టీ పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కమిటీ కూర్పును పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలో నేడు పార్టీ కార్యవర్గ సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ చేసిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ చీఫ్ లు, అనుబంధ సంఘాల చీఫ్ లకు ఆహ్వానం పంపారు. సదరు ఆహ్వానాల్లో వేదిక పేరు స్థానంలో గాంధీ భవన్ కాకుండా, గోల్కొండ హోటల్ పేరు ఉంది. దీంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన నూతన కార్యవర్గం ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని తిన్నగా గోల్కొండ హోటల్ కు బయలుదేరారు. అయినా వారికి తెలిసిన అసలు విషయమేంటంటే... పార్టీ పదవులు దక్కని అసంతృప్త నేతలు గాంధీ భవన్ కు వచ్చి గొడవ చేస్తారన్న కారణంగానే సమావేశం వేదిక మారిందట. అంటే పొంగులేటి నిరసన దెబ్బకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోల్కొండ హోటల్ కు పరుగులు పెట్టారన్న మాట!