: మరోసారి అంగారక గ్రహాన్ని చేరే ప్రయత్నం.. రోదసి ప్రణాళికను ఆవిష్కరించిన చైనా
అంగారక గ్రహాన్ని చేరే ప్రయత్నాన్ని చైనా మరోసారి మొదలు పెట్టింది. అంగారక గ్రహాన్ని చేరే దిశగా రష్యా రాకెట్ ద్వారా 2011లో యుంగ్యువో-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా.. అప్పట్లో విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రయోగానికి మరోసారి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రోదసి ప్రణాళికను ఆవిష్కరించింది. 2020లోపు అంగారక యానం చేయాలని యోచిస్తోంది. ఒక రోవర్‌ను ఆ గ్రహంపైకి పంపాలని చూస్తోంది. ఇప్పటికే సుదూర అంతరిక్ష యాత్రలను చేపట్టిన తాము అంగారక గ్రహంపైకి కూడా తమ వ్యోమనౌకను పంపుతామని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సహా చాలా దేశాలు ఇప్పటి దాకా అంగారక గ్రహాన్ని చేరే దిశగా 51 ప్రయోగాలు చేశాయి. అయితే వాటిలో ఐరోపా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ (నాసా), రష్యా రోదసీ సంస్థ మొదటిసారి విఫలమైన తర్వాతే విజయం సాధించాయి. ఆ దిశలోనే చైనా మరోసారి ఈ ప్రయోగానికి దిగి విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తోంది. కాగా, భారత్ ఆ దిశగా అంగారక అన్వేషణ ఉపగ్రహంను తొలి ప్రయత్నంలోనే నిర్విఘ్నంగా సాగించింది. భారత్ ప్రయోగించిన మంగళ్‌యాన్ మొదటి ప్రయత్నంలోనే విజయతీరాలకు చేరిన విషయం తెలిసిందే.