: ‘అనంత’లో వైసీపీకి మిగిలేది ఒక్క ఎమ్మెల్యేనే!... విజయసాయి బుజ్జగింపులకు మెత్తబడని చాంద్ బాషా


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ... అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యను ‘ఒకటి’కి పరిమితం చేసేస్తోంది. గడచిన ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డితో పాటు కదిరిలో చాంద్ బాషా విజయం సాధించారు. ఈ క్రమంలో గతంలో తమ పార్టీలోనే ఉన్న చాంద్ బాషాపై దృష్టి పెట్టిన టీడీపీ... ఆయనను తన వైపు తిప్పుకోవడంలో విజయవంతమైంది. 2014 వరకు టీడీపీలోనే కొనసాగిన చాంద్ బాషా... ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో వైసీపీ టికెట్ ను సాధించిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ‘ఆకర్ష్’కు తలొగ్గిన చాంద్ బాషా పార్టీ మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు చేసిన యత్నాలు ఫలించలేదు. పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న చాంద్ బాషా నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చాంద్ బాషా పార్టీ మారితే అనంతపురం జిల్లాలో వైసీపీకి ఇక ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాత్రమే మిగులుతారు.

  • Loading...

More Telugu News