: నవ్యాంధ్రకు ఎఫ్ డీఐల వెల్లువ!... దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకిన ఏపీ!
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. లోటు బడ్జెట్, ఆర్థిక లోటు తదితర సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రంలో... ఒక్కోసారి సర్కారీ ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు కూడా ఇబ్బందులెదురవుతున్నాయి. అయితే నవ్యాంధ్రకు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం రాష్ట్రాన్ని అబివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు సర్కారు చేపట్టిన వినూత్న చర్యలతో... రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ) పోటెత్తుతున్నాయి. కేవలం రెండేళ్లలోనే అధిక శాతం ఎఫ్ డీఐలను రాబడుతున్న మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. 2013లో ఏపీకి కేవలం 190 కోట్ల డాలర్ల ఎఫ్ డీఐలు రాగా... 2015లో ఈ మొత్తం ఏకంగా 610 కోట్ల డాలర్లకు చేరింది. ఇక ఈ రెండేళ్ల మధ్య 2014లో రాష్ట్రానికి 242 కోట్ల డాలర్ల మేర ఎఫ్ డీఐలు వచ్చాయి. అంటే... రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఎఫ్ డీఐల వెల్లువ పెరిగిందని తేటతెల్లమైంది. ప్రస్తుతం ఏపీ కంటే అధికంగా ఎఫ్ డీఐలు రాబడుతున్న రాష్ట్రాలు దేశంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ జాబితాలో మూడో స్థానం ఏపీదే. ఈ మేరకు ‘ఎఫ్ డీఐ ఇంటెలిజెన్స్’ నిన్న ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది.