: మతాంతర వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి నిరాకరిస్తున్న అధికారులు... ఆవేదనలో ప్రేమజంట!
సాధారణంగా మేజర్లయిన యువ జంట ఎవరైనా సరే రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటామంటే ప్రభుత్వ అధికారులు ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో మాత్రం ఓ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రారే కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) కూడా ఈ విషయంలో ఆ జంటకు సహకరించడం లేదు. వివరాల్లోకి వెళ్తే...బీఫ్ తింటున్నాడంటూ మహ్మద్ అఖ్లాఖ్ ను హత్య చేసిన దాద్రి ప్రాంతానికి సమీపంలోని చిటెహ్రా గ్రామానికి చెందిన మనోజ్ భాటి (24), సల్మా (20)లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారింది. గత ఏడాది అక్టోబర్ 19న అలహాబాద్ పారిపోయి ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా సల్మా హిందువుగా మారి స్వప్నా ఆర్యగా పేరు మార్చుకుంది కూడా. ఇంతలో తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ సల్మా తల్లిదండ్రులు మనోజ్ భాటిపై కేసు పెట్టారు. దీంతో తామిద్దరం మేజర్లమని, ఆర్య సమాజ్ లో తమ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని రుజువులు చూపించారు. దీంతో పోలీసులు వారిని వదిలేశారు. అనంతరం దాద్రి వచ్చి తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించగా, రిజిస్ట్రారు అంగీకరించలేదు. వారి వివాహాన్ని ఆమోదిస్తే దాద్రిలో అల్లర్లు రేగే అవకాశముందని పేర్కొంటున్నారు. దీంతో వారు కలవని ఉన్నతాధికారి లేరు. జిల్లా అదనపు మేజిస్ట్రేట్ (అదనపు కలెక్టర్), జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) వంటి ప్రముఖులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఫలితం శూన్యం. ఇక ఆఖరు ప్రయత్నంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. కనీసం ఆయనైనా వీరి వివాహానికి చట్టబద్ధత కల్పిస్తారేమో చూడాలి.