: నన్ను అలా పిలవద్దు...వాటికి నేను వ్యతిరేకం: రకుల్ ప్రీత్ సింగ్
తనను గోల్డెన్ లెగ్ అని పిలవడం ఇష్టం ఉండదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. సరైనోడు ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, తాను గోల్డెన్ లెగ్ కాదు, అలాగని ఐరన్ లెగ్గూ కాదు. తనకు మామూలు కాళ్లే ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్పింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే చాలా మంది కృషి ఉండాలని పేర్కొంది. అలాగే అంత కష్టపడి తీసిన సినిమా సరైన రోజున విడుదల చేయకపోయినా కూడా ప్రతికూల ఫలితమే వస్తుందని చెప్పింది. అలాంటప్పుడు ఒక సినిమా విజయం, పరాజయం ఒకే ఒక వ్యక్తికి అంటగట్టడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది. అలాగే తాను నెంబర్ గేమ్ ను కూడా ఇష్టపడనని స్పష్టం చేసింది. ఒక సినిమాలో కొందరు బాగా నటిస్తారు, ఇంకొందరు ఇంకా బాగా నటిస్తారు. అదే బెస్ట్ అని చెప్పడానికి కొలమానం ఏంటని ప్రశ్నించింది. తనకు తెలిసినంతవరకు గుడ్, బెటర్ ఉంటాయని, ఇంకా అద్భుతంగా ఉంటే అది బెస్ట్ అయి ఉంటుంది తప్ప ప్రోగ్రస్ రిపోర్టులా ర్యాంకులు ఉండవని తెలిపింది.