: కేసీఆర్ కు మానవత్వం లేదు!: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మానవత్వం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేరు ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి ఉంచడంపై మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో పాలేరు నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంతో చేశారని, అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి ఒకరిని అసెంబ్లీకి పంపిస్తే బాగుండేదన్నారు. పాలేరు సీటు విషయమై టీఆర్ఎస్ పార్టీతో చర్చించాలని భావిస్తున్న సమయంలో ఆ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారంటూ గుత్తా విమర్శించారు.