: కడిగిన ముత్యంలా బయటికొస్తా చూడండి: 'కాల్ మనీ' నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి
తనపై పెట్టిన కేసుల్లోంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కరీంనగర్ కాల్ మనీ నిందితుడు ఏఎస్సై మోహన్ రెడ్డి తెలిపాడు. బెయిల్ పై విడుదలైన అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన దగ్గర వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయన్నది అవాస్తవమని అన్నాడు. తన దగ్గరున్న ప్రతి పైసాకి లెక్కలున్నాయని ఆయన చెప్పాడు. తుపాకీ పెట్టి బెదిరించానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పాడు. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వంశపారంపర్య ఆస్తుల నుంచి వచ్చిన డబ్బునే తాను పెట్టుబడి పెట్టానని ఆయన చెప్పాడు. కాగా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడని పదుల సంఖ్యలో బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న మోహన్ రెడ్డి, హత్యలకు కూడా వెనకాడడం లేదని, బెదిరింపులకు దిగుతున్నాడని వారంతా ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు డిపార్ట్ మెంట్ లోని పెద్దలే అతని వెనుక పెట్టుబడిదారులు కావడంతో ఈ కేసులో విచారణలో జాప్యం జరుగుతోందని, న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో వాస్తవాలు ఉండకపోవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను కేసుల నుంచి బయటపడడం పెద్ద కష్టం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.