: ఎన్నో సమస్యలు వేధిస్తుంటే, తొలిసారి అసెంబ్లీకి వచ్చిన రోజాపై ఇంత గోలెందుకు?: సుప్రీంకోర్టు సూటి ప్రశ్న


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి ఈ సస్పెన్షన్ల గోలేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ పై వాదనలు విన్న అనంతరం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. రాజధాని లేక, సరిపడినన్ని నిధులు, వనరులు లేక రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేసింది. రోజా తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన శాసన సభ్యురాలని, అభివృద్ధికి మీరంతా సహకరించుకోవాలని, రాద్ధాంతం కూడదని హితవు పలికింది. రోజా పరుష వ్యాఖ్యలను తొలితప్పుగా తీసుకోవాలని సూచించింది. ఇటువంటి కేసుల వల్ల శాసన వ్యవస్థకు, కోర్టులకూ మధ్య ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఈ కేసులో మధ్యేమార్గంగా సానుకూల దృక్పథంతో బేషజాలకు పోకుండా పరిష్కరించుకోవాలని తెలిపింది. రోజా స్పీకర్ కు క్షమాపణలు చెప్పి, తనకు నోటీసులు ఇచ్చిన మూడు కమిటీలకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని, అసెంబ్లీ వాటిని పరిగణనలోకి తీసుకుని కేసుకు స్వస్తి చెప్పాలని సూచించింది. ఈ మేరకు రోజా తరఫు న్యాయవాది, అసెంబ్లీ న్యాయవాదులు సమావేశమై చర్చించుకోవాలని ఆదేశించింది. వీరి మధ్య సయోధ్య కుదరకుంటే, పూర్తి వాదనలు విని తామే తీర్పిస్తామని చెబుతూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News