: మోదీ, ఫడ్నవీస్ ఫొటోలు వాడినందుకు క్షమాపణలు చెప్పిన ‘రియల్’ సంస్థ


ప్రధాని నరేంద్రమోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల ఫొటోలు వాడినందుకు క్షమాపణలు చెబుతున్నామని మహారాష్ట్రకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది. పూణెలోని రియల్ ఎస్టేట్ సంస్థ మాపెల్ గ్రూప్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తక్కువ ధరలకే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఇస్తామంటూ సదరు సంస్థ చేసిన ఒక ప్రకటనలో మోదీ, ఫడ్నవీస్ ల ఫొటోలను వాడారు. ఈ విషయం ఫడ్నవీస్ కు తెలియడంతో మాపెల్ గ్రూప్ ప్రకటనలపై విచారణకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ‘మాపెల్’ సీఎండీ సచిన్ అగర్వాల్ మాట్లాడుతూ, తమ ప్రకటనల్లో మోదీ, ఫడ్నవీస్ ఫొటోలను వాడటం వల్ల వారిద్దరికీ కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని.. జరిగిన పొరపాటుకు క్షమించమని కోరారు. కాగా, కేవలం రూ.5 లక్షలకే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని ‘మాపెల్’ ఇటీవల ప్రకటించింది. పూణెలోని 14 ప్రాంతాల్లో పదివేల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల కోసం 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల పేర్ల ను లాటరీ తీస్తామని, అందులో ఎవరి పేర్లయితే వస్తాయో వారికే ఫ్లాట్లు కేటాయిస్తామంటూ సంస్థ ఒక మెలిక పెట్టింది. లాటరీ లో పేర్లు రాని వారికి వారు చెల్లించిన రూ.1,200 తిరిగి ఇచ్చివేస్తామన్నారు. మే 1వ తేదీన లాటరీ తీయనున్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర మంత్రి గిరీష్ బాపట్ మాట్లాడుతూ, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాలన్నింటిని స్తంభింపజేశామని, భూమికి సంబంధించిన ఎటువంటి లావాదేవీలు నెరపడానికి అనుమతించమన్నారు. మోదీ, ఫడ్నవీస్ ల తో సదరు సంస్థకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News