: ఇండియాపై మరీ అంత అత్యాశ వద్దు: రాజన్ మరో సంచలన వ్యాఖ్య
అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా నిలబడాలంటే సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వుందని, ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమంటూ, భారత్ కు ఉన్న 'ట్యాగ్ లైన్' ను చూసి అత్యాశ చెందవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. ఇండియా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటని, తలసరి ఆదాయం ఎన్నో దేశాల కన్నా తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆవసరాలు తీర్చాలంటే, ఇండియా ఎంతో దూరం ప్రయాణించాల్సి వుందని ఆయన అన్నారు. ప్రస్తుతమున్న వృద్ధి రేటు కనీసం మరో 20 సంవత్సరాల పాటు కొనసాగితేనే, ఇండియాలో ప్రతి ఒక్కరికీ సుఖవంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. భారతీయులతో పోలిస్తే, చైనీయులు నాలుగు రెట్లు అధిక తలసరి ఆదాయంతో ఉన్నారని అన్నారు. 1960 ప్రాంతంలో భారత ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చైనా తక్కువగా ఉండేదని, ఇప్పుడది ఇండియాకన్నా ఐదు రెట్ల అధిక వ్యవస్థను కలిగివుందని తెలిపారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల్లో అత్యంత తక్కువ తలసరి ఇండియాదేనన్న విషయం మరువరాదని అన్నారు. కాగా, గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను వాడే రాజు అన్నట్టు ఇండియా పరిస్థితి ఉందని రాజన్ ఇటీవల వ్యాఖ్యానించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.