: తక్కువ ధరకు చిన్న కార్ల ఆలోచన లేదు: హ్యుందాయ్
ఇండియాలో తక్కువ ధరకు చిన్న కార్లను అందించడంలో తామేమీ మిగతా కంపెనీలతో పోటీ పడబోమని, రెండో అతిపెద్ద పాసింజర్ కార్ల సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది. చిన్న కార్ల సెగ్మెంట్ లో కొనసాగాలంటే క్వాలిటీపై రాజీ పడాల్సి వుంటుందని, అది ఇష్టం లేకనే తామీ నిర్ణయం తీసుకున్నామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాంగ్ కెయ్ కూ వ్యాఖ్యానించారు. "చాలా ఆటో సంస్థలు చిన్న కార్లను రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల రేంజ్ లో అందిస్తున్నాయి. మా సగటు ధర రూ. 7 లక్షలు. స్మాల్ కార్ కేటగిరీలో మేము యుద్ధం చేయలేము. మరింత నాణ్యత, బ్రాండ్ పైనే దృష్టిని సారించాలని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు. చిన్న కార్ల సెగ్మెంట్ లో మరే విధమైన ప్రొడక్టునూ విడుదల చేయబోవడం లేదని కెయ్ కూ స్పష్టం చేశారు.