: దమ్ముంటే... ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేసి రా!... తుమ్మలకు సవాల్ విసిరిన నామా
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అప్పుడే వేడి రాజుకుంది. కేవలం గంటల వ్యవధిలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదవిలో ఉండగా మరణించిన ఎమ్మెల్యే కుటుంబానికి ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా కట్టబెట్టాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన టీఆర్ఎస్... పాలేరు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో గెలుపు తమదేనంటూ తుమ్మలతో పాటు టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ ప్రకటించారు. ఇక ఖమ్మం జిల్లాలో తుమ్మలకు బద్ధ శత్రువుగా పేరుపడ్డ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలోకి దించాలని టీ టీడీపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన నామా... తుమ్మలకు సవాల్ విసిరారు. టీడీపీని వాడుకుని వదిలేసిన తుమ్మలను ఓడించి తీరతామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం తమతో ఇతర విపక్షాలన్నీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తుమ్మలకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి బరిలోకి దిగాలని ఆయన సూచించారు. అధికార పార్టీ బెదిరింపులకు తాము బెదిరేది లేదని ప్రకటించిన నామా... పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, పాలేరు బరికి తాను సిద్ధమేనని ప్రకటించారు.