: నాన్న పేరు నిలబెట్టాలని చంద్రబాబు చెప్పారన్న పరిటాల శ్రీరామ్... జేజేలు పలికిన ‘అనంత’వాసులు
టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అంకురార్పణ చేసిన సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ఆయన కొడుకు పరిటాల శ్రీరామ్ కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం పరిటాల సొంతూరు అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం సమీపంలోని తిరుమల దేవరగుడి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల్లో 250కి పైగా నవ దంపతులు ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ రెండంటే రెండు నిమిషాలు మాట్లాడినా... తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. చంద్రబాబు తనకు చెప్పిన ఓ విషయాన్ని ఈ సందర్భంగా శ్రీరామ్ గుర్తు చేశారు. ‘‘నీ పేరు గొప్పగా చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా... నాన్న పేరు మాత్రం నిలబెట్టాలని చంద్రబాబు చెప్పారు’’ అంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలతో అక్కడి జనం జేజేలు పలికారు. సభా ప్రాంగణం పరిటాల రవి నినాదాలతో మారుమోగిపోయింది.