: విపక్షాలన్నీ ఏకమైనా... గెలుపు నాదే!: పాలేరు బరిలోకి దిగేసిన తుమ్మల


ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగిపోయారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పాలేరు ఉప బరికి తుమ్మల పేరును ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మల... కేసీఆర్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో నేటి ఉదయం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన తుమ్మల... పాలేరులో తన విజయం నల్లేరుపై నడకేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని విపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేసినా తనను ఓడించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని తాను భావించానని, అయితే నాడు అవకాశం దక్కలేదన్నారు. తాజాగా తనకు ఇష్టమైన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతానన్నారు. పార్టీ అధినేత ఏ పనిని అప్పగించినా... నిబద్ధతతో ముందుకు సాగుతానని కూడా తుమ్మల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News