: బౌలర్లు ఆకట్టుకున్నప్పటికీ...బెంగళూరు దూకుడు ఆగలేదు
ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు ఆకట్టుకున్నప్పటికీ, బెంగళూరు బ్యాట్స్ మన్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. గేల్ లేకపోవడంతో అతని స్థానం ఓపెనర్ గా వచ్చిన టీమిండియా టెస్టు ఆటగాడు కేఎల్ రాహుల్ (12) ఆదిలోనే వెనుదిరిగాడు. కోహ్లీ (33)తో జతకలిసిన డివిలియర్స్ (29) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ నిలదొక్కుకున్నారనుకునేంతలో క్రునాల్ పాండ్య దెబ్బతీశాడు. ఇద్దర్నీ పెవిలియన్ కు పంపాడు. తరువాత వచ్చిన వాట్సన్ (5) తొందరగానే పెవిలియన్ చేరాడు. దీంతో వచ్చిన హెడ్ (37), సర్ఫరాజ్ ఖాన్ (28) భారీ షాట్లతో అలరించగా, వారి తరువాత వచ్చిన స్టువర్ట్ బిన్నీ (1)ని కూడా బుమ్రా పెవిలియన్ కు పంపాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 170 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసి రాణించగా, క్రునాల్ పాండ్య రెండు, మెక్ క్లెంగన్ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 171 పరుగుల విజయ లక్ష్యంతో ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది.