: దళిత వరునిపై అగ్రవర్ణాల దాడి
దళిత వరునిపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దాడికి దిగడం గుజరాత్‌లో అలజడి రేపింది. ఆ రాష్ట్రంలోని సబర్‌కాంత జిల్లా అడపొడ్రొ గ్రామంలో పెళ్లి సందర్భంగా వరుడు గుర్రం ఎక్కి వివాహ ఊరేగింపు వేడుకలో పాల్గొనడం స్థానికంగా ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. దళితుడనే కారణంతో పలువురు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు వరుడు గుర్రాన్ని దిగాలని ఆదేశించారు. వారి బెదిరింపు లెక్కచేయకుండా వరుడు గుర్రం ఎక్కి వివాహ ఊరేగింపు కొనసాగించడంతో అగ్రవర్ణాలకు చెందిన వారు అతనిపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన ముగ్గురు దళితులను చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చెలరేగడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను చేరుకున్నాయి. దళితులపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.