: మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షపదవి రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష పదవి బరిలోకి దిగినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా మాత్రమే వివాదాల్లో చిక్కుకుంటోన్న ట్రంప్.. ఈసారి తాను తిరుగుతోన్న విమానాన్ని రెన్యూవల్ చేయించుకోకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన ఉపయోగిస్తోన్న సెస్నా జెట్ విమానం రిజిస్ట్రేషన్ గడువు జనవరి 31తో ముగిసింది. ఇప్పటి వరకూ ఆయన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేదు. దీంతో సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ట్రంప్ కి ఈ విమానంతో పాటు మరో నాలుగు హెలికాప్టర్లు ఉన్నాయి. ఒకవేళ నోటీసుల నేపథ్యంలో సెస్నా జెట్ విమానాన్ని వినియోగించుకోలేకపోతే ఇకపై ట్రంప్ తన హెలికాఫ్టర్లలో తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ట్రంప్ తన విమానాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంపై పలు విమర్శలొస్తున్నాయి.