: 11 సార్లు అమెరికా వెళ్లొచ్చి కూడా... తిరిగొస్తానని నమ్మించలేకపోయిన ప్రముఖ ఉర్దూ కవి!
రాహత్ ఇందోరీ... ప్రముఖ ఉర్దూ కవి. గడచిన పది సంవత్సరాల వ్యవధిలో 11 సార్లు అమెరికాలో పర్యటించి వందలాది కవి సమ్మేళనాల్లో పాల్గొన్న కవి. ఈ దఫా మాత్రం యూఎస్ వీసాను పొందలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? 66 ఏళ్ల రాహత్ ఇక ఇండియాకు తిరిగి రారని వీసా ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారి భావించడమే. డల్లాస్ లో వచ్చే నెల 7న 'జష్న్-ఏ-ఇందోరీ' పేరిట ఆయన గౌరవార్థం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, దానికి వెళ్లేందుకు నాన్-ఇమిగ్రెంట్ వీసా కావాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. "యూఎస్ కాన్సులేట్ నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలిచింది. ఇంటర్వ్యూ తరువాత నా పాస్ పోర్టు నాకు తిరిగి ఇచ్చారు. ఈ దఫా యూఎస్ వెళ్లేందుకు నాకు వీసా ఇవ్వడం లేదని చెప్పారు. ఆపై తాను తిరిగి ఇండియాకు వస్తానన్న నమ్మకాన్ని కలిగించలేదని చెబుతూ, వీసా నిరాకరించిన కారణాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. నాకిక్కడ ఇల్లుంది. కుటుంబముంది. ఇది నా మాతృభూమి. ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాను?" అని ఆయన తన ఆవేదనను పంచుకున్నారు. గతంలో ఎన్నోసార్లు తాను అమెరికాలో పర్యటించానని, ఈసారి ఇలా జరిగిందని అన్నారు.