: మీడియా ముందుకు వచ్చిన ఆనం!... జగన్ పై ఘాటు విమర్శలు
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడాను కూడా జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆనం వ్యాఖ్యానించారు. తండ్రి అధికారంలో ఉండగా... దోచుకుని, దాచుకున్న ప్యాకేజీలే జగన్ కు తెలుసని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ పునర్నిర్మాణంపై జగన్ కు కనీస అవగాహన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంత్రులకు దక్కిన ర్యాంకుపై స్పందించిన వివేకా మంత్రి నారాయణపై ప్రశంసలు కురిపించారు. మంత్రిగా చివరి ర్యాంకులో నిలిచిన నారాయణ.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తారని కితాబిచ్చారు.