: టీ కాంగ్రెస్ లో ముసలం!... పార్టీ పదవులకు పొంగులేటి రాజీనామా!
తెలంగాణ కాంగ్రెస్ లో కొద్దిసేపటి క్రితం పెను కలకలం రేగింది. టీ పీసీసీ పదవుల కేటాయింపులో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లను పక్కనబెడుతున్న రాష్ట్ర నాయకత్వం... తమకు అనుకూలంగా ఉన్నవారి మాటకే ప్రాధాన్యమిస్తూ జూనియర్లను అందలమెక్కించిందని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుకు నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేసిన పొంగులేటి... తన రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు పంపారు. విషయం తెలుసుకున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. పొంగులేటిని ప్రసన్నం చేసుకునే పనిలో వారు మునిగిపోయారు. పొంగులేటి రాజీనామా లేఖల విషయం బయటకు పొక్కడంతో ఆ పార్టీ వర్గాలు షాక్ కు గురయ్యాయి.