: నరేంద్ర మోదీని పిలిచి, మాట్లాడమనండి: అమెరికన్ ప్రజాప్రతినిధులు


భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించి, ఉభయ సభలను (కాంగ్రెస్) ఉద్దేశించి ప్రసంగింపజేయాలని యూఎస్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ కు ప్రజాప్రతినిధులు ఓ లేఖను రాశారు. జూన్ 7 నుంచి రెండు రోజుల పాటు ఆయన వాషింగ్టన్ పర్యటనకు రానున్నారని గుర్తు చేసిన పలువురు సభ్యులు, ఆ సమయంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆయనతో మాట్లాడించాలని కోరారు. "ఇండియాతో రక్షణ రంగం, విపత్తుల్లో సహాయక చర్యలు, అంతరిక్ష సహకారం, వినూత్న ఉత్పత్తులు, మానవీయ కోణం వంటి ఎన్నో విభాగాల్లో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన చట్టసభల్లో చేసే ప్రసంగం, భవిష్యత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగునకు ఎంతో ఉపకరిస్తాయి" అని ర్యాన్ కు రాసిన లేఖలో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఉటంకించారు. ఈ లేఖపై యూఎస్ విదేశాంగ శాఖ హౌస్ కమిటీ చైర్మన్ ఎడ్ రాయ్సీ, ర్యాంకింగ్ మెంబర్ ఎలియాట్ ఎంజెల్, కాంగ్రెస్ సభ్యులు జార్జ్ హోల్డింగ్, అమీ బెరా తదితరులు సంతకం చేశారు. కాగా, ప్రధాని మోదీ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇది నాలుగో అమెరికా పర్యటనన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News