: శిశు గృహంలో దారుణం.. ఐదేళ్ల అనాథ పిల్లలకు వాతలు పెట్టి, నరకం చూపించారు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శిశుగృహంలో అనాథ పిల్లలకు ఆయాలు నరకం చూపించారు. అన్నం తినకుండా అల్లరి చేస్తున్నారని కనీసం ఐదేళ్ల వయసయినా లేని ఆ పిల్లలపై రాక్షసత్వం ప్రదర్శించారు. తనిఖీకి వచ్చిన ఐసీడీఎస్ అధికారులకు శిశుగృహంలో ఆరుగురు అనాథ చిన్నారుల చేతులపై వాతలు కనపడడంతో ఆయాల ప్రవర్తన బయటపడింది. చిన్నారుల చేతులు కాలిన గాయాలతో కనపడడంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులకు ఆయాలు బుచ్చమ్మ, శారద, పద్మ చిన్నారులకు వాతలు పెట్టారని తెలిసింది. ఓ చెంచాను వేడి చేసి అనాథ పసిపిల్లలపై వాతలు పెట్టిన దృశ్యాలు అధికారులను, స్థానికులను కలచివేశాయి. అనాథ పిల్లలను అమ్మానాన్నల్లా చూసుకోవాల్సిన ఆయాలు నరకం చూపించడంతో వారిని విధుల నుంచి తొలగించిన అధికారులు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.