: ‘ఆకర్ష్’కు చెక్ పెట్టేందుకు ‘బళ్లారి బ్రదర్స్’ ను రంగంలోకి దించిన జగన్!
ఏపీలో అధికార టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. గడచిన ఎన్నికల్లో వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కంటే రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలు జిల్లాలో అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లుంటే... వైసీపీ 11 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు తొలుత ఆ జిల్లాల్లోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కీలక నేత, అప్పటిదాకా ప్రజా పద్దుల సంఘం చైర్మన్ గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్ది, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు అఖిలప్రియతో కలిసి సైకిలెక్కేశారు. ఆ తర్వాత ఆలూరు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా టీడీపీలో చేరిపోయారు. ఆ జిల్లాలో వైసీపీ నుంచి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. జిల్లాలో టీడీపీ కీలక నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల చేసిన ప్రకటనే ఈ ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో తన పార్టీకి అత్యంత బలమైన జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే... తనకు అపార నష్టమేనని జగన్ భావిస్తున్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను నిలువరించేందుకు ఆయన చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో తాజాగా వినూత్న చర్యకు ఆయన శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డితో పాటు బళ్లారి ఎంపీ శ్రీరాములును ఆయన రంగంలోకి దించారట. ఆర్థికంగా బలీయంగా ఉన్న ఈ బళ్లారి బ్రదర్స్... జగన్ సూచనతో ఇఫ్పటికే రంగంలోకి దిగిపోయారని సమాచారం. విడతలవారీగా జరిపిన చర్చల్లో భాగంగా పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతతో పాటు భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామన్న వారి హామీతో పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ నేతలు మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక బళ్లారి బ్రదర్స్ హామీలకు ఏమాత్రం తలొగ్గని ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారట. ఇప్పటికే తన అనుయాయులతో మంతనాలు జరిపిన ఆ ఎమ్మెల్యే... పార్టీ మారే విషయాన్ని వారి ముందు పెట్టారట. దీనికి అనుచరుల నుంచి మద్దతు రావడంతో త్వరలోనే ఆయన వైసీపీకి చేయిచ్చేసి సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.