: ప్రేమ వలేస్తారు... 'డేంజరస్ లవ్'లో పడకండి... వీధుల్లో పోస్టర్లు వేస్తూ, అమ్మాయిలను హెచ్చరిస్తున్న చైనా ప్రభుత్వం
లవ్ జీహాద్... ఇండియాలో జరుగుతున్న ప్రచారం. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరిట ముస్లిం యువకులు ముగ్గులోకి దింపి వారి మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాయలో పడవద్దని హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అచ్చంగా ఇలాగే కాకున్నా, టీనేజిలోని అమ్మాయిలు ప్రేమ వలలో పడవద్దని చెబుతూ, ఆ దేశ ప్రభుత్వం స్వయంగా పోస్టర్లు వేసి ప్రచారం చేస్తోంది. ఎందుకో తెలుసా? అందమైన యువకులను తమ దేశానికి పంపే విదేశాలు, ఇక్కడి యువతులను టార్గెట్ గా చేసుకుని దేశ రహస్యాలు సేకరిస్తున్నాయన్నది చైనా ఆరోపణ. దీన్ని అరికట్టేందుకు ఏకంగా 'డేంజరస్ లవ్' అనే టైటిల్ తో పోస్టర్లను ముద్రించి పంచుతోంది. జాతీయ భద్రతా విద్యా దినం సందర్భంగా ఈ పోస్టర్ ను చైనా సర్కారు విడుదల చేసింది. వయసులో ఉన్న అమ్మాయిలు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు, అందమైన విదేశీయులతో డేటింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారు గూఢచారులు కావచ్చని హెచ్చరించింది. యువతులకు మరింత అర్థమయ్యేలా చెప్పేందుకు క్సియావో లీ అనే కల్పిత పాత్రను సృష్టించి, విదేశీ యువకుడు ఎలా ట్రాప్ చేశాడో చూపుతూ ఓ కామిక్ బుక్ ను కూడా విడుదల చేసింది. వీరిద్దరి పరిచయం, ప్రేమ వ్యవహారాలు, డిన్నర్లు, ఆపై తన కార్యాలయంలోని రహస్య పత్రాలను యువకుడికి ఇవ్వడం, అరెస్టులు, కఠిన శిక్ష... ఇలా చిత్రాలతో కూడిన పుస్తకాలను పంచాలని నిర్ణయించింది. ఇప్పుడీ పోస్టర్ చైనాలోని పలు చోట్ల దర్శనమిస్తోందట.