: తన కూతురిపై దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడికి ఓ తండ్రి వేసిన శిక్ష!
ముక్కుపచ్చలారని తన ఎనిమిదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని ఆ బాలిక తండ్రి కఠినంగా శిక్షించాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల యువకుడి రెండు చేతులనూ నరికేశాడు. ఈ ఘటన పంజాబ్ లోని భటిందా సమీపంలో జరిగింది. తీవ్రగాయాల పాలైన అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిని సందర్శించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం అత్యాచార ఘటన జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడు, బాధితురాలి తండ్రి ఇద్దరూ భటిందాకు సమీపంలోని కోట్లీ అబ్లూ గ్రామానికి చెందిన వారని, అత్యాచారం కేసు విషయమై కలిసే కోర్టుకు వెళ్లి వస్తుండేవారని పోలీసులు తెలిపారు. తాజాగా వాయిదాకు వెళ్లిన సమయంలో కేసులో కాంప్రమైజ్ అవుదామని అనుకుంటూ, ఒకే బండిపై తిరిగి వస్తున్న వేళ జుంబా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి తండ్రి, నిందితుడిని చెట్టుకు కట్టేసి, కత్తితో చేతులు తెగనరికాడు. ఇప్పుడతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది.