: మాట మార్చిన కేంద్రం!... కోహినూర్ ను తెప్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటన
విలువైన కోహినూర్ వజ్రంపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బ్రిటన్ రాణి కిరీటంలో ఒదిగిపోయిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెప్పించేందుకు పకడ్బందీ చర్యలు చేపడతామని నిన్న ప్రకటించింది. కోహినూర్ వజ్రం చోరీకి గురి కాలేదని, దానిని ఈస్టిండియా కంపెనీకి మన రాజులు బహుమతిగా ఇచ్చారని, ఈ కారణంగా ఆ వజ్రాన్ని తిరిగి తీసుకురాలేమని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును నడిపిస్తున్న బీజేపీకి సిద్ధాంతకర్తగా పేరుపడ్డ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కూడా సొలిసిటర్ జనరల్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో చేసిన వాదన తమది కాదని పేర్కొంది. కోహినూర్ వజ్రం తరలింపులోని వరుస పరిణామాలను మాత్రమే సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారని చెప్పింది. ఏదేమైనా కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.