: తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల హెచ్చరికలు... వడదెబ్బతో 11 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో 72 గంటల పాటు వడగాలులకు అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల సమయంలో బయటకు వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బతో 11 మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని విఠల్ నగర్ లో వృద్ధుడు వెంకటయ్య, మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం రుద్రారంలో రైతు భిక్షపతి, నారాయణఖేడ్ మండలంలోని పైడిపల్లిలో రైతు గోపాల్, వరంగల్ జిల్లా జఫర్ గడ్ మండలంలోని తీగారంలో కూలీ హరిలాల్, ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ లో వృద్ధుడు, నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తిలో వృద్ధుడు గోపాల్, కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని గోపాల్ రావు పేటలో ఒక వ్యక్తి, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూరులో వృద్ధురాలు, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వృద్ధురాలు, మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ లో ఒక వ్యక్తి, ఖమ్మం జిల్లా భద్రాచలంలో వృద్ధుడు ఆకారం వెంకటస్వామి వడదెబ్బతో మృతి చెందారు.